School Management Committee(SMC) details in Telugu – పాఠశాల యాజమాన్య కమిటీ మార్గదర్శకాలు
పాఠశాల యాజమాన్య కమిటీలు ఎందుకు?
పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా బడి నిర్వహిస్తున్న ఆవాస ప్రాంతంలోని పెద్దలు, విద్యాభిమానులు, తల్లిదండ్రులు, సహకారం ద్వారా ఉపాధ్యాయులు పాఠశాల నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చును. పాఠశాలకు కల్పించే వసతుల విషయంలో, బడి ఈడు పిల్లలను బడికి రప్పించడంలో, బడి బయటి పిల్లలను బడికి తిరిగి రప్పించుటలో ఉపాధ్యాయులకు స్థానికులు సహకరించడం ‘ ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు.
పాఠశాల యాజమాన్య కమిటీని ఎందుకు స్వాగతించాలి?
వీవరి పిల్లలయితే పాఠశాలలో చదువుతున్నారో వారిని పాఠశాలకు ఆహ్వానించి, వివిధ అంశాలపై (నమోదు, హాజరు, ప్రగతి, వసతుల కల్పన…) చర్చించడం ద్వారా, పాఠశాల కార్యక్రమాలలో భాగస్వాములుగా చేయడం ద్వారా పాఠశాలలను బలోపేతం చెయ్యవచ్చును. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేటి పరిస్థితులలో పాఠశాల యాజమాన్య కమిటీలను పాఠశాల కార్యక్రమాలలో భాగస్వాములుగా చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చును. విద్యార్థుల ప్రగతికి ఆటంకం కలిగించే అంశాలను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో చర్చించడం ద్వారా అడ్డంకులను అధిగమించవచ్చును. ఎస్ఎంసిని పాఠశాల కార్యక్రమాలన్నింటిలో భాగస్వాములుగా చేయడం ద్వారా ఉపాధ్యాయులకు సమస్యల భారం కూడా తగ్గుతుంది.

పాఠశాల యాజమాన్య సంఘం ఏర్పాటుకు నిబంధనలు:
బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం – 2009 లో పాఠశాల యాజమాన్య సంఘం గురించి ప్రస్తావించిన సెక్షన్లు – వివరాలు
ఆర్.టి.ఇ -2009 సెక్షన్ 21(1) ప్రకారం బడి యాజమాన్య సంఘం ఏర్పాటు చేయాలి. ఉచిత, నిర్బంధ విద్యకు బాలల హక్కు నిబంధన 19 ప్రకారం చట్టం అమలులోకి వచ్చిన 6 నెలల లోపు అన్ ఎయిడెడ్ పాఠశాలలు తప్ప ప్రతి పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ తప్పక ఏర్పాటుచేయాలి.
విద్యాహక్కు చట్టం-2009లోని సెక్షన్ 19 సబ్ సెక్షన్ (1) ప్రకారం ప్రతి పాఠశాలలో (గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మినహా) పాఠశాల యాజమాన్య సంఘం తప్పక ఏర్పాటుచేయాలి. 1-5, 1-7, 1-8 తరగతులు నిర్వహించే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకే యాజమాన్య సంఘం ఏర్పాటుచేయాలి. ఉన్నత పాఠశాలల్లో , 6-8 తరగతులకు ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్య సంఘం’ ఏర్పాటుచేయాలి. ప్రాథమిక పాఠశాల పాఠశాలల్లో ఏర్పాటుచేసిన యాజమాన్య సంఘాలను మండల విద్యాధికారి, ఇతర పాఠశాలల యాజమాన్య సంఘాలను జిల్లా విద్యాశాఖాధికారి రద్దు చేసేవరకు పాఠశాల యాజమాన్య సంఘం కొనసాగుతుంది.
ప్రతినిధుల ఎన్నిక:
ప్రతి తరగతికి చెందిన తల్లిదండ్రులు / సంరక్షుకుల నుండి ముగ్గురు తల్లిదండ్రులు / సంరక్షకులను ప్రతినిధులుగా ఎన్నుకోవాలి. ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలు అయి ఉండాలి. ముగ్గురిలో కనీసం ఒక వ్యక్తి ప్రతికూల
పరిస్థితులకు చెందిన వర్గానికి, మరొకవ్యక్తి బలహీన వర్గాలకు చెంది ఉండాలి. • ఒక తరగతిలో విద్యార్థులు ఆరుగురి కంటే తక్కువ ఉంటే మరొక పై/
కింది తరగతిని కలిపి ఎన్నిక నిర్వహించాలి. ఎన్నుకోబడిన ప్రతినిధుల కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది. అన్ని సెక్షన్లు, మాధ్యమాలను కలిపి ఒకే తరగతిగా పరిగణించాలి. ఒకవేళ ఎన్నుకోబడిన ప్రతినిధికి చెందిన పిల్లలు పాఠశాలలను వదలిపెడితే ‘ఆస్థానంలో నిర్ణీత సమయానికి కొత్తవారిని ఎన్నుకోవాలి.
ప్రత్యేక ఆహ్వానితులు:
పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా ఆస్థానంలో ఇంఛార్జి బాధ్యతలు
నిర్వహిస్తున్న టీచర్ మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. మండల విద్యాధికారి మరొక టీచర్ ను ప్రతిపాదించాలి. సాధారణంగా
వీరిద్దరిలో ఒకరు స్త్రీ అయి ఉండాలి.
పాఠశాల భవనం ఉన్న ప్రాంత కార్పోరేటర్ / కౌన్సిలర్ / వార్డు సభ్యులు.
పాఠశాల నిర్వహిస్తున్న ప్రాంతానికి చెందిన అంగనీవాడీ కార్యకర్త.
పాఠశాల నిర్వహిస్తున్న ప్రాంతానికి చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్త.
సంబంధిత గ్రామ / వార్డు యొక్క మహిళా సమాఖ్య అధ్యక్షురాలు.
కో-ఆప్టెడ్ సభ్యులు:
పాఠశాలకు సహకరించే విద్యావేత్తలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు, తత్వవేత్తలు_వంటివారి నుండి ఇద్దరిని ఎన్నుకోబడిన పాఠశాల యాజమాన్య సంఘ సభ్యులు కో-ఆప్ట్ చేసుకోవాలి. పాఠశాల ఆవాస ప్రాంత సర్పంచ్ | మున్సిపల్ చైర్మన్ | మేయర్ పాఠశాల యాజమాన్య సంఘం సమావేశానికి హాజరుకావచ్చు.
ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
ప్రతి తరగతి నుండి ఎన్నుకోబడిన ప్రతినిధుల నుండి ఒకరిని ఛైర్మన్ గా, మరొకరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకోవాలి. వీరిద్దరిలో ఒకరు మహిళ అయి ఉండాలి. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లలో ఒకరు బలహీన వర్గాలు లేదా ప్రతికూల పరిస్థితులకు చెందిన వర్గాలకు చెందినవారై ఉండాలి.
ఎన్నిక విధానం
ప్రతి విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయిన ఒక నెల ఆ తర్వాత తల్లిదండ్రులు, సంరక్షకులతో ప్రధానోపాధ్యాయులు వార్షిక సాధారణ సమావేశం నిర్వహించాలి. అందరు పిల్లల తల్లిదండ్రులు / సంరక్షకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ సమావేశానికి హాజరుకావాలి. గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన విద్యా సంబంధ, అభ్యసన కృత్యాలకు సంబంధించి పాఠశాల నివేదిక మరియు ప్రస్తుత విద్యా సంవత్సరలో అమలు చేయవలసిన అంశాల ప్రణాళిక సమర్పించాలి.
పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు మరియు నిర్వహణ సంబంధ అంశాలను
క్రోడీకరించాలి. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఇద్దరూ సమావేశానికి హాజరుకావచ్చు. కాని ‘ఎన్నికలో పాల్గొనుటకు ఒక్కరికే ఓటుహక్కు ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ తరగతులలో పిల్లలు చదువుతుంటే ప్రతి తరగతి
ఎన్నికలలో తల్లిదండ్రులలో ఎవరో ఒకరు పాల్గొనవచ్చు.
ప్రధానోపాధ్యాయులు ఎన్నిక నిర్వహించాలి.
ఎన్నిక నిర్వహించుటకు 50% తల్లిదండ్రులు / సంరక్షకులు హాజరు కావలసి ఉంటుంది.
చేతులు ఎత్తడం ద్వారా, అభిప్రాయం చెప్పడం ద్వారా ఎన్నిక నిర్వహించాలి.
అసాధారణ పరిస్థితులలో రహస్య బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించవచ్చు.
ప్రతి రెండు నెలలకోసారి పాఠశాల యాజమాన్నయ సంఘం ఒకసారి సమావేశమవ్వాలి.
మొదటి సమావేశం విద్యాసంవత్సరం ప్రారంభంలో, చివరి సమావేశం విద్యా సంవత్సరం చివరలో నిర్వహించాలి.
చివరి సమావేశంలో విద్యా సంవత్సరం మొత్తం విద్యా సంబంధ ప్రగతి మరియు కార్యక్రమాలను సమీక్షించుకోవాలి.
పాఠశాల యాజమాన్య సంఘం సభ్యులెవరైనా ప్రత్యేక అజెండాతో సమావేశం నిర్వహించాలని కోరితే ఛైర్మన్ అనుమతితో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక సమావేశం నిర్వహించాలి లేదా రాబోయే సమావేశంలోని అజెండాలో ఆ అంశాలు చర్చించుటకు వీలుగా చేర్చాలి.
పాఠశాల యాజమాన్య సంఘం విధులు – బాధ్యతలు
ఆర్టిఇ-2009 సెక్షన్ 21(1) ప్రకారం ఏర్పాటుచేయబడిన పాఠశాల యాజమాన్య కమిటీ కనీసం రెండు నెలలకు ఒకసారి సమావేశమై బడి అవసరాలు, పిల్లల ప్రగతి సమస్యలు మొదలగు వాటిని చర్చించి సమావేశంలో తీసుకునే తీర్మానాలు మినట్స్‌లో రికార్డు చేసి అందరికి అందబాటులో ఉంచాలి.
మినిట్స్ లో రాసుకున్నవాటి అమలును పర్యవేక్షించాలి.
సెక్షన్ 21(2) ప్రకారం బడి యాజమాన్య సంఘం ఈ కింది విధులు నిర్వర్తిస్తుంది.
బడి పనితీరును పర్యవేక్షించడం.
బడి అభివృద్ధి ప్రణాళికను తయారుచేసి, సిఫారసు చేయడం.
సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం లేదా ఇతర వనరుల నుంచి అయినా ” అందిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం. ‘
సిఫారసు చేసిన ఇతర విధులను నిర్వర్తించడం.
పాఠశాల నిర్వహణ అనగా బడి పనిదినాలు, బడివేళలు, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరు మొదలగువాటి పర్యవేక్షణ మరియు సమీక్ష చేయడం.
పాఠశాలలో కనీస మౌళిక వసతుల కల్పన మరియు వినియోగం. ‘ బడిఈడు పిల్లల వివరాల రిజిష్టరు నిర్వహించడం.
ఆవాస ప్రాంతంలోని బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా చూడడం.
బడిలో చేరిన పిల్లలందరూ ఆ బడిలో చివరి తరగతి పూర్తయ్యేవరకు కొనసాగేలా చూడడం.
తమ పాఠశాలలలో చదువు పూర్తయిన పిల్లలు ద్రాపౌట్ కాకుండా సమీపంలోని పాఠశాలలలో అందరినీ పై తరగతులలో చేర్చడం.